ముంబై : ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అవకాశాలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్రధాన కోచ్ టామ్ మూడీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో వారు ఫైనల్ చేరడం కష్టమేనని జట్టులో సరైన కూర్పు లోపించిందని మూడీ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ముంబై జట్టలో స్వదేశీ, విదేశీ బౌలర్లు సరిగా రాణించడంలేదని మూడీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్‌లో చాలా మంది పవర్ హిట్టర్లు ఉన్నారని, ఇందులో యువ ఆటగాళ్లైన డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు టిమ్ డేవిడ్ కూడా ఉన్నారని, ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కోవడంలో జట్టుకు అనుభవం లేదని మూడీ అభిప్రాయపడ్డాడు, ఈ సీజన్‌లో వారి వైఫల్యానికి ఇది ఒక ముఖ్యమైన అంశమని స్పష్టం చేశాడు.
ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. ఇప్పుడు ఏప్రిల్ 8న వాంఖడే స్టేడియంలో తమ అతిపెద్ద ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. మరోవంక MS ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఒక మ్యాచ్ గెలిచింది మరొకటి ఓడిపోయింది. తమ రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించిన తర్వాత తమ అవకాశాలపై నమ్మకంతో ఉంది. ఏదేమైనా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుని విజయపథంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.