ప్రధానాంశాలు
- ఓర్లీన్స్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన భారత యువ షట్లర్
- BWF ర్యాంకింగ్స్‌లో 20 స్థానాలు పైకి
- ప్రియాంశు రజావత్ @ 38
- కెరీర్‌లో తొలి సూపర్-300 టైటిల్ కైవసం
మనం ఐపీఎల్ ధ్యాసలో పడి ఓర్లీన్స్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన భారత యువ షట్లర్ ‘ప్రియాంశు రజావత్’ను సరిగ్గా పట్టించుకోలేకపోయాం. ప్రియాంశు రజావత్ సంచలనం సృష్టించాడు. ఏమాత్రం ఆశలే లేకుండా బరిలోకి దిగిన ఈ 21 ఏండ్ల కుర్రాడు ఒర్లిన్స్ మాస్టర్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
మంగళవారం విడుదల చేసిన తాజా BWF ర్యాంకింగ్స్‌లో ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్‌లో టైటిల్ గెలుచుకున్న భారత ఆటగాడు ప్రియాంశు రజావత్ 20 స్థానాలు ఎగబాకి 38వ ప్రపంచ ర్యాంకింగ్‌లో నిలిచాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాంశు… డెన్మార్క్‌కు చెందిన మాగ్నస్ జోహన్‌సెన్‌ను 21-15, 19-21, 21-16తో ఓడించి కొన్ని విలువైన ర్యాంకింగ్ పాయింట్‌లను సంపాదించి తన తొలి సూపర్ 300 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అతను ఇప్పుడు BWF ర్యాంకింగ్స్‌లో 30,786 పాయింట్లతో నాల్గవ అత్యుత్తమ ర్యాంక్ కలిగిన భారతీయ పురుషుల సింగిల్స్ ఆటగాడు.
కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ లక్ష్యసేన్ ఒక స్థానం ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకోగా, కిదాంబి శ్రీకాంత్ రెండు స్థానాలు కోల్పోయి ప్రపంచ 23వ ర్యాంక్‌కు పడిపోయాడు.
పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 8వ స్థానంలో అత్యుత్తమ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
మహిళల సింగిల్స్‌లో స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్‌కు చేరిన పివి సింధు సింధు 11వ ర్యాంక్‌లో సైనా 31 స్థానంలో కొనసాగుతున్నది. డబుల్స్‌లో సాత్విక్ -చిరాగ్ శెట్టి జోడీ ఆరో ర్యాంక్‌లో ఉంది.
MR అర్జున్, ధృవ్ కపిల జంట27వ స్థానంలో ఉంది. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్ జోడీ ప్రపంచ 20వ ర్యాంక్‌కు పడిపోయింది.
ఎవరీ ప్రియాంశు రజావత్?

ఓర్లీన్స్ మాస్టర్స్ ఫైనల్‌లో తొలిసారిగా కనిపించిన ప్రియాంశుకు ఇది తొలి వరల్డ్ టూర్ టైటిల్. జాతీయ సర్క్యూట్‌లో చాలా కాలంగా మంచి ప్రతిభ కనబరిచిన ప్రియాంశు, గత ఏడాది థామస్ కప్ గెలిచిన భారత జట్టులో భాగం. అంతకు ముందు అంతర్జాతీయ సిరీస్-స్థాయి టైటిల్ కంటే పెద్దగా ఏమీ గెలవలేదు, చివరిగా సెప్టెంబర్ 2022లో ఇండియా చత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ గెలిచాడు.
అయితే ఓర్లీన్స్ మాస్టర్స్ ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో టాప్ సీడ్ కెంటా నిషిమోటో ఓటమితో సహా, ఫైనల్‌కు వెళ్లే మార్గంలో అన్ని మ్యాచ్‌లు స్ట్రెయిట్ గేమ్‌లలో గెలవడం ద్వారా అతను అంతర్జాతీయ వేదికపైకి సంచలనంలా దూసుకువచ్చాడు.
ప్రపంచ ర్యాంక్‌లో 58వ స్థానంలో ఉన్న ప్రియాంషు తన ఐదు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. తన మెరుగైన బలంతో ప్రత్యర్థులను సుదీర్ఘ ర్యాలీలు ఆడేలా చేసి వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. నిషిమోటోను ఓడించడానికి తన ట్రేడ్‌మార్క్ శైలికి అనుగుణంగా పాదాల్ని వేగంగా కదిపి జపనీస్ ఆటగాడిని కంగు తినిపించాడు. సెమీఫైనల్‌లో, అతను ప్రపంచ నం. 35, ఐర్లాండ్ ఆటగాడిని కేవలం 44 నిమిషాల్లో ఓడించాడు.
ర్యాలీలతో పాటు డిఫెన్స్‌లోనూ ప్రియాంశు దిట్ట

తొలి గేమ్‌లో వరుస పాయింట్లు సాధించిన ప్రియాన్షు విరామ సమయానికి 11-8తో స్పష్టమైన ఆధిక్యం కనబర్చాడు. క్రాస్‌కోర్ట్ షాట్లతో విరుచుకుపడ్డ ప్రియాన్షు.. 18-11తో ఆధిపత్యం కొనసాగిస్తూ తొలి గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయంలో ప్రియాన్షు ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేసి 7-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ దశలో డెన్మార్క్ ప్లేయర్ దీటుగా బదులివ్వడంతో స్కోరు 9-9తో సమమైంది. ఈ క్రమంలో ప్రియాన్షు 54 షాట్ల ర్యాలీని నెగ్గడం విశేషం. సుదీర్ఘ ర్యాలీలతో సాగిన పోరులో చివరి వరకు పట్టువదలని ప్రియాన్షు కెరీర్‌లో అతిపెద్ద టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
తన ఎనిమిదేళ్ల వయసు నుంచి జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు ప్రియాంశు. హైదరాబాద్‌లో శ్రీకాంత్, సమీర్, ప్రణయ్‌లతో కలిసి శిక్షణ తీసుకోవడం కలిసొచ్చింది. ముఖ్యంగా సమీర్ వర్మ యొక్క రిఫ్లెక్స్ డిఫెన్స్ ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యాడు.
మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన షట్లర్, రాజస్థానీ జిరాక్స్ వ్యాపార యజమాని కుమారుడు ప్రియాంశు. తన ఆరేళ్ల వయసులో తన అన్న కునాల్ రజావత్ అడుగుజాడల్లో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించాడు. రెండు సంవత్సరాల తరువాత, గ్వాలియర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గోపీచంద్‌ని అతని వేగవంతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. గోపీచంద్ హైదరాబాద్ అకాడమీలో ఆ బాలుడికి శిక్షణ ఇచ్చాడు.
బ్యాడ్మింటన్‌లో వేగంగా ఉండటం ఒక ప్రయోజనంగా భావించబడుతుంది, అయితే అతని కోచ్ గోపీచంద్ ఆటలను ముగించే ఆతురుతలో ఉన్నట్లు అనిపించినందున అతన్ని ఓపికగా ఉండమని గోపీచంద్ ఎల్లప్పుడూ హెచ్చరించేవాడు. తన ఏకాగ్రతను మెరుగుపరచడానికి, అతను తన ఆటతో ధ్యానం కూడా ప్రాక్టీస్ చేశాడు. ఆ ఫలితం ఓర్లీన్స్‌లో అతని ఆటలో స్పష్టంగా కనిపించింది.
ప్రియాన్షు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఓర్లీన్స్ మాస్టర్స్‌లో తొలి టైటిల్ అతన్ని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 38లోకి తీసుకువచ్చింది. అతని కలకి రెక్కలొచ్చేలా చేసింది.