ప్రధానాంశాలు
- ఐపీఎల్ చరిత్రలో తొలి కవల సోదరులు
- డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్
- తోబుట్టువులే ప్రత్యర్థులు
- MI జట్టులో డువాన్ జాన్సెన్
- SRH టీంలో మార్కో జాన్సెన్
ముంబయి: ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డువాన్ జాన్సెన్ IPL అరంగేట్రం చేసాడు. అతని అన్న మార్కో జాన్సెన్ సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. జాన్సెన్ బ్రదర్స్ వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో IPL క్రికెట్ ఆడిన మొదటి కవలలుగా వీరు చరిత్ర సృష్టించారు.
సూర్యకుమార్ నుంచి MI క్యాప్ అందుకుంటున్న డువాన్ జాన్సెన్

అరంగ్రేట మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ, డువాన్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 53 పరుగులిచ్చి రింకు సింగ్ వికెట్‌ను మాత్రమే తీయగలిగాడు. సో అతని అరంగేట్రం అంతగా గుర్తుంచుకోదగినది కాదు. అయితే, ఈ సీజన్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తే తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
మార్కో లాగే, డువాన్ కూడా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్. 2019 సంవత్సరంలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. డువాన్ ఇప్పటివరకు 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 36 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో 540 పరుగులు చేశాడు. ఇది కాకుండా, డువాన్ 16 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మార్కో జాన్సెన్ అత్యుత్తమ ఆటగాడు. అతను ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి ప్రతి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై 2/16 , KKRపై 2/37 అద్భుతంగా రాణించాడు.
మార్కో జాన్సెన్ సీనియర్-స్థాయి అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే డువాన్ ఇంకా సీనియర్ స్థాయిలో తన దేశం కోసం ఆడలేదు. 2017-18లో భారత టెస్ట్ జట్టు దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు డువాన్‌కు భారీ ఆత్మవిశ్వాసం లభించింది. విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడానికి అతని కవల సోదరుడు మార్కోతో పాటు నెట్ బౌలర్‌గా వచ్చారు. అతను కోహ్లీ లాంటి గొప్ప వ్యక్తిని మెప్పించగలిగాడు. ప్రశంసలు సైతం దక్కాయి.
విరాట్ కోహ్లీతో జాన్సన్ బ్రదర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికితీసింది. టోర్నమెంట్‌లో గతంలో చాలా మంది అన్నదమ్ములు పాలుపంచుకున్నారు. ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, అల్బీ మోర్కెల్, మోర్నే మోర్కెల్, మైఖేల్ హస్సీ, డేవిడ్ హస్సీ, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, బ్రెండన్ మెకల్లమ్,నాథన్ మెక్‌కలమ్, డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావోలు ఉన్నారు. ఉదయ్ కౌల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్. అయితే జాన్సన్ బ్రదర్స్ కవలలు కావడం విశేషం.
ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్

ఈ తోబుట్టువులు ప్రత్యర్థులుగా క్రికెట్ ఆడుతుంటే చూడ్డానికి భలే కనువిందుగా ఉంటుంది. ఎందుకంటే వారు ఆయా జట్లను గెలిపించేందుకు ఒకరితో ఒకరు సై అంటే సై అంటూ పోరాడారు. ముఖ్యంగా పఠాన్ సోదరుల మధ్య జరిగిన ద్వంద్వ పోరాటం బాగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ఇర్ఫాన్ స్వింగ్ బౌలర్‌గా తన అన్నయ్య వికెట్ తీయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు.