ప్రధానాంశాలు
- మన క్రికెటర్లకు పెట్స్ అంటే ఎంతో ఇష్టం
- ధోనీ వద్ద మేలు జాతి కుక్కలు
- విరాట్ కోహ్లీ దగ్గర లాబ్రడార్
- రోహిత్ వద్ద బీగల్ కుక్క
- హార్థిక్ పాండ్యా దగ్గర ఆస్టన్, బెంట్లీ పేరిట రెండు కుక్కలు
ఒకప్పుడు కుక్కలను పెంచడం ఓ స్టేటస్ సింబల్… ఇప్పుడు అదో హాబీలా అయిపోయింది. ముఖ్యంగా కుక్కలను రక్షణ కోసం కంటే ఒక కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేసే వాళ్ల సంఖ్య పెరిగింది. ఇంట్లో చిన్నపిల్లలకు ఒక మంచి ఫ్రెండ్‌గా.. పెద్ద వాళ్లకు తోడుగా ఉంటూ వస్తున్నాయి. టీమ్ ఇండియా క్రికెటర్లలో కూడా పెట్ లవర్స్ (Pet Lovers) ఉన్నారు. చాలా మంది క్రికెటర్ల ఇళ్లల్లో కనీసం ఒక పెంపుడు కుక్క అయినా ఉంటోంది. చాలా మంది తమ ప్రియమైన పెంపుడు జంతువులతో సమయాన్ని గడపడం ఆనందిస్తారు. ఈ క్రీడాకారులు వాటి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేయడం, తరచుగా తమ పెట్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ కథనంలో మొత్తం పది మంది ప్రముఖ భారతీయ క్రికెటర్లు, వారి పెంపుడు జంతువుల గురించి తెలుసుకుందాం….
మహేంద్ర సింగ్ ధోనీ
ఈ జాబితాలో భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. ధోని అమితమైన జంతు ప్రేమికుడు, అతని వద్ద నాలుగు కుక్కలు ఉన్నాయి. వీటికి సామ్, బెల్జియన్ మలినోయిస్, లిల్లీ, గబ్బర్ అని వీటిని ప్రేమగా పిలుచుకుంటారు., ఫామ్ హౌస్‌లో రెండు తెల్ల హస్కీలు, జోయా, డచ్ షెపర్డ్ వీటికి అదనం. అతని రాంచీ ఫామ్‌హౌస్‌లో హనీ అనే చిలుక, చేతక్ అనే పోనీ ఉన్నాయి. ధోని తన పెంపుడు జంతువులతో తన విలువైన సమయాన్ని గడుపుతూ, వాటికి కొత్త విషయాలు నేర్పిస్తూ, బేషరతుగా వాటి పట్ల ప్రేమను చూపుతూ ఉంటాడు. ధోనీ, సాక్షి, కూతురు జీవా చాలా సార్లు కుక్కలతో కలసి ఉన్న ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జీవా ఎప్పుడూ కుక్కలతో గడపడం మనం తరచూ చూస్తూనే ఉంటాము.
రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శర్మ వద్ద కూడా కుక్కలు ఉన్నాయి. రోహిత్‌తో పాటు అతని భార్య రితిక కూడా మంచి పెట్ లవర్. రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల తన కుటుంబంలోకి బీగల్ కుక్కను తీసుకొచ్చారు. రోహిత్ మైదానం వెలుపల ఉన్నప్పుడు, తన పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతాడు. తరచుగా వాటి చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటాడు. రోహిత్ శర్మ జంతువుల హక్కులు, వాటి పెంపకంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పుడూ ప్రస్తావిస్తుంటాడు. ముంబైలోని కొలాబాలో నివసించే రోహిత్ అత్త, మామలు సైతం పెట్ లవర్సే. వాళ్ల దగ్గర మ్యాజిక్ అనేకుక్క ఉన్నది. రోహిత్, రితిక ఎప్పుడు ఆ ఇంటికి వెళ్లినా మ్యాజిక్ చాలా ఆప్యాయంగా వాళ్ల దగ్గరకు వస్తుందని గురునాథ్ చెబుతున్నారు. రోహిత్ కూతురు కూడా మ్యాజిక్‌తో సరదాగా గడుపుతుందట.
విరాట్ కోహ్లీ
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దశాబ్దంపైగా కుక్కలను పెంచుతున్నాడు. 11 ఏళ్ల పాటు విరాట్ పెంచిన బర్నో అనే కుక్క.. ఇటీవలే మరణించింది. దీంతో కోహ్లీ చాలా అప్‌సెట్ అయ్యాడు. కోహ్లీ, అనుష్క తమ పెంపుడు కుక్క బర్నో చనిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించి చాలా బాధపడ్డారు. తగిన సమయంలో, వారు కొత్త పెంపుడు కుక్క, లాబ్రడార్‌ను తమ జీవితంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దానికి ‘డ్యూడ్’ అని పేరు కూడా పెట్టుకున్నారు.
హార్ఢిక్ పాండ్యా
భారత టీ-20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా కుక్కలు పెంచుకోవడం అంటే మహా సరదా. అతని వద్ద ఆస్టన్, బెంట్లీ అనే రెండు కుక్కలున్నాయి. తన 25వ జన్మదినాన్ని పురస్కరించుకుని, అతను తన కుటుంబంలోకి ఒక టెర్రియర్ జాతి కుక్కను సైతం తీసుకొచ్చాడు. బెంట్లీ పట్ల విపరీతమైన ప్రేమ. “బెంట్లీ పాండ్యా” అని పేరు పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బెంట్లీ పట్ల తనకున్న ఆరాధనను చాటుకున్నాడు. తన కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని హార్దిక్ పేర్కొన్నాడు. లాక్‌డౌన్ సమయంలో తన ‘పెట్స్’తో మరింత ఎక్కువ సమయాన్ని గడపగలిగాడు. అతని కుటుంబం కూడా బెంట్లీ పట్ల ప్రేమను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటుంది. హార్దిక్ తన పెట్స్ ఫోటోలు, వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.
సచిన్ టెండూల్కర్
భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ దేవుడు సచిన్ రమేష్ టెండూల్కర్ జంతువుల పట్ల తనకున్న అభిమానానికి ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటాడు. 2021లో స్పైక్ అనే బ్లాక్ లాబ్రడార్ కుక్కను తెచ్చుకున్నాడు. టెండూల్కర్ తన పెంపుడు కుక్క స్పైక్‌తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. అభిమానులు ఉత్సాహంగా భారీ సంఖ్యలో లైక్‌లు కొట్టారు. టెండూల్కర్ జంతువుల పట్ల తనకున్న ప్రేమ గురించి ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. కుక్కలతో పాటు, క్రికెట్ లెజెండ్ పిల్లులు, పక్షులతో పోజులిచ్చాడు. జంతువుల పట్ల అతని అభిమానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
కె.ఎల్.రాహుల్
ప్రస్తుతం భారత జట్టులో కీలక ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఆయన దగ్గర “సింబా” అనే పేరుగల చౌ చౌ జాతికి చెందని కుక్క ఉంది, దానిని అతను అమితంగా ఆరాధిస్తాడు. తరచుగా తన సోషల్ మీడియా ఖాతాలలో సింబా యొక్క చిత్రాలు, వీడియోలను పంచుకుంటాడు, ఆ కుక్క సైతం అతన్ని ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. రాహుల్ తన వీపుపై సింబా పచ్చబొట్టు కూడా వేయించుకొని, , తన పెంపుడు జంతువు పట్ల ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. రాహుల్ దగ్గర సింబాతో పాటు షేరు అనే గోల్డెన్ రిట్రీవర్ అనే మరో కుక్క కూడా ఉంది. రాహుల్ తన పెంపుడు జంతువులతో ఎన్నో మనోహరమైన క్షణాలను పంచుకున్నారు. రాహుల్ నిజమైన జంతు ప్రేమికుడని, అతని పెంపుడు జంతువులు అతని హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ కుమార్ భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు మాజీ వైస్ కెప్టెన్, ప్రసిద్ధ అంతర్జాతీయ క్రికెటర్. ఇతనికి పెంపుడు జంతువులంటే అమితమైన ఇష్టం. అతని వద్ద ‘అలెక్స్’ అనే పేరుగల లాబ్రడార్ రిట్రీవర్ ఉంది. . భువనేశ్వర్ తాను, అలెక్స్ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటున్న మనోహరమైన కోల్లెజ్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు, ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది హృదయాలను దోచుకుంది. వేలల్లో లైక్‌లు వచ్చాయి. దీంతో చాలామంది వ్యాఖ్యలు జోడించారు. సం, అలెక్స్ కేవలం పెంపుడు జంతువు మాత్రమే కాదు; అతను నిజమైన స్నేహితుడు నమ్మకమైన సహచరుడని భువీ చెబుతుంటాడు.
హర్భజన్ సింగ్
మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ కూడా సీరియస్ పెట్ లవర్. తన ఇంట్లో కూడా కుక్క ఉన్నది. ఇటీవల తన కూతురు కుక్క పిల్లలతో ఆడుకుంటున్న ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. హర్బజన్ తన కుటుంబం, అతని పెట్స్ రెండింటినీ ఎంతో విలువైనదిగా భావిస్తాడు. పెంపుడు జంతువుల ఫొటోలను ఆన్‌లైన్‌లో పంచుకుంటాడు. పెంపుడు జంతువుల పట్ల హర్భజన్ సింగ్‌కి ఉన్న ప్రేమను మాటల్లో వర్ణించలేము. జంతు సంరక్షణ కోసం ప్రతినబూనాడు. ప్రజలు వీధి కుక్కలు, పిల్లులను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ప్రజలు తమ పెంపుడు జంతువులను ప్రేమ, సంరక్షణతో ఎలా పెంచాలో ప్రోత్సహించారు.
శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ సైతం పెట్స్‌ను అమితంగా ప్రేమిస్తాడు. తను లాబ్రడార్ జాతి కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా బెట్టి అని పిలుచుకుంటాడు. తన ఒత్తిడిలో ఉన్నప్పుడు తన కుక్కతో సేదతీరుతాడు. శ్రేయస్ తన పెంపుడు కుక్క బెట్టీతో ఎంతో సరదాగా గడుపుతాడు. అయ్యర్ భుజం గాయంతో ఉన్నప్పుడు బెట్టితోనే ఎక్కుగా కాలక్షేపం చేశాడు. అతని కుటుంబమంతా బెట్టీని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తన పెంపుడు కుక్క బెట్టీతో అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటాడు.
యూసుఫ్ పఠాన్
భారతక్రికెట్ జట్టు ఒకప్పటి సంచలనం, హార్డ్ హిట్టర్ బ్యాట్స్‌మెన్ యూసుఫ్ పఠాన్ జంతు ప్రేమికుడు. అతని దగ్గర గుర్రాలు, మేకలు, పావురాలు, చిలుకలు ఉన్నాయి. యూసుఫ్ పఠాన్ ప్రతిభావంతులైన క్రికెటర్ మాత్రమే కాదు, జంతువులు, పర్యావరణం గురించి లోతుగా శ్రద్ధ వహించే మానవతావాది. కొన్నేళ్ల క్రితం విశాఖపట్నం సమీపంలోని హైవేపై గాయపడిన పక్షిని రక్షించడంతో యూసుఫ్‌కు జంతువులపై ఉన్న ప్రేమ మనందరికీ తెలిసింది.