ప్రధానాంశాలు
- దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న యశ్
- నిన్నటి రోజు ఒక పీడకల
- తలెత్తుకో చాంపియన్ అంటూ కేకేఆర్ ట్వీట్
- క్రీడాస్ఫూర్తికి నిదర్శనం ఈ ట్వీట్
అహ్మదాబాద్: ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్‌కు నిన్నటి రోజు ఒక పీడకలగా మిగిలిపోనుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రింకూ సింగ్ యష్ దయాల్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు.
ఆఖరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు ఇచ్చి తమ జట్టు ఓటమి కారణమయ్యాడు. దీంతో ముఖం చేతుల్లో దాచుకుంటూ యశ్ దయాల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ‘యశ్’ను ఉద్దేశించి తలెత్తుకో చాంపియన్ అంటూ కేకేఆర్ ట్వీట్ చేసింది. బాధ పడొద్దంటూ ధైర్యం చెప్పింది. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Chin up, lad. Just a hard day at the office, happens to the best of players in cricket. You’re a champion, Yash, and you’re gonna come back strong 💜🫂@gujarat_titans pic.twitter.com/M0aOQEtlsx
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
KKRతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన యష్ దయాల్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా మొత్తం 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా 4 ఓవర్లు వేసి 69 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలోనే యష్ దయాల్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో యష్ దయాల్ రెండో స్థానంలో నిలిచాడు.
తొలి స్థానంలో బాసిల్ థంపి (4 ఓవర్లలో 70 పరుగులు, 2018లో ఆర్సీబీతో మ్యాచ్‌లో) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఇషాంత్ శర్మ 2013లో సీఎస్కేతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 66 పరుగులు), ముజీబ్ ఉర్ రెహమాన్(2019లో ఎస్ఆర్త్తో మ్యాచ్లో 4 ఓవర్లలో 66 పరుగులు), ఉమేశ్ యాదవ్( 2013లో ఆర్సీబీతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 65 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఎవరీ యశ్ దయాల్?
ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్‌లో 1997 డిసెంబరు 13న యశ్ దయాల్ జన్మించాడు. 2018లో యూపీ తరఫున లిస్ట్ ఏక క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 17 ఫస్ట్ క్లాస్, 14 లిస్ట్ ఏ మ్యాచ్. 33 టీ20లు ఆడిన యశ్ దయాల్ మూడు ఫార్మాట్లలో వరుసగా 58, 23, 29 వికెట్లు తీశాడు.
దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ పేస్ బౌలర్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 వేలంలో 3.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు టైటాన్స్ తరఫున యశ్ దయాల్ 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో టీమిండియా ‘వన్డే సిరీస్’కు ఎంపికైన యశ్.. దురదృష్టవశాత్తూ.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.