ప్రధానాంశాలు
- ఈ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన పూరన్
- 2015లో పూరన్ కార్ యాక్సిడెంట్
- గాయాలతో క్రికెట్టే ఆడలేడన్నారు
- రెండు కాళ్లకు సర్జరీలు
- అయినా మొండి ధైర్యంతో ముందుకు
బెంగళూరు: నిన్నరాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు తక్కువేమీకాదు. రెప్పపాటులో బెంగళూరు నుంచి విజయాన్ని లాక్కున్న నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
నిన్నటి మ్యాచ్‌లో పూరన్ వచ్చీరావడంతోనే బెంగళూరు బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన పూరన్.. హర్షల్‌కు 6,4,6 తన బ్యాట్ పవర్ ఏంటో రుచి చూపించాడు. పార్నెల్ బౌలింగ్‌లో 4,6,4తో 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్‌సెంచరీ కావడం విశేషం.
𝙏𝙝𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙤𝙛 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 🥵@LucknowIPL's swashbuckling batter scores the fastest #TATAIPL2023 5️⃣0️⃣ 💥 #RCBvLSG #JioCinema #IPLonJioCinema pic.twitter.com/w62ZhrkROV
— JioCinema (@JioCinema) April 10, 2023
ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా యూసప్ పఠాన్, సునీల్ నరైన్ సరసన నిలిచాడు. 2014, 2017లో యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్ వరుసగా 15 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు. లక్నో కెప్టెన్ KL రాహుల్, ప్యాట్ కమ్మిన్స్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించారు.
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరిమనుసులు గెలుచుకున్న పూరన్ ఒకప్పుడు గాయాలతో అసలు క్రికెట్టే ఆడలేడనుకుంటే…. ఈ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసాడు. నిజానికి పూరన్ క్రికెట్ కెరీర్ 2015లోనే ముగియాల్సింది. 2015లో నికోలస్ పూరన్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు డాక్టర్లు నికోలస్ పూరన్‌తో మళ్లీ క్రికెట్ ఆడలేడని చెప్పారు. క్రికెట్‌కు స్వస్తి చెప్పాలని పూరన్‌కి సూచించారు.
అసలేం జరిగిందంటే….
ఓసారి నేషనల్ క్రికెట్ సెంటర్ నుండి ప్రాక్టీస్ అనంతరం తన ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో పూరన్ మాట్లాడుతూ… ‘ప్రమాదం తర్వాత నేను స్పృహతప్పి పడిపోయాను. ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నేను స్పృహలోకి వచ్చాక, ఏమి జరిగిందో విని నేను ఆశ్చర్యపోయాను.
నన్ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాళ్లు కదపలేకపోయాను. ఎడమ మోకాలు విరిగింది. కుడి కాలు చీలమండలంలో ఫ్రాక్చర్ అయింది. రెండు సర్జరీలు జరిగాయి. ఘటన జరిగిన 24 గంటల లోపే తొలి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు ఫ్రాక్చర్ అయిన చీలమండలం గాయాన్ని సరిచేయడానికి మరొక శస్త్రచికిత్స జరిగింది. 18 నెలల తర్వాత పూరన్ క్రికెట్ మైదానంలోకి మొక్కవోని ధైర్యంతో తిరిగి వచ్చాడు. నిజానికి నికోలస్ పూరన్ ఏ యువ క్రికెటర్‌కైనా స్ఫూర్తిగా నిలుస్తాడు.