23.7 C
Hyderabad
Wednesday, July 23, 2025

Buy now

spot_img

ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ !

ఐపీఎల్‌ ఎంతో మంది టాలెంటెడ్‌ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ జాబితాలో హైదరాబాదీ తిలక్ వర్మ ముందువరసలో ఉంటాడు. ముంబై తరపున నిలకడగా రాణిస్తున్నాడు. యాజమాన్యం ప్రశంసలు అందుకుంటున్నాడు.

ప్రధానాంశాలు:

  • ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకొచ్చిన ఎంతో క్రికెటర్లు
  • ఆ జాబితాలో హైదరాబాదీ తిలక్ వర్మ
  • ‘ముంబై ఇండియన్స్’లో తెలుగు కుర్రాడు
  • ముంబై జట్టులో రాణిస్తున్న తిలక్ వర్మ
  • హర్షా భోగ్లే, రవిశాస్త్రి ప్రశంసలు

హైదరాబాద్: ఐపీఎల్‌ ఎంతో మంది టాలెంటెడ్‌ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ జాబితాలో హైదరాబాదీ తిలక్ వర్మ ముందువరసలో ఉంటాడు. ఐపీఎల్‌ 2023లో ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. అయితే ఒక్క ఆటగాడు మాత్రం ముంబై తరపున నిలకడగా రాణిస్తున్నాడు. సూపర్‌ స్ట్రైక్‌ రేట్‌తో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అతనెవరో కాదు.. హైదరా బాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మ. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ‘ఢిల్లీ క్యాపిటల్స్’తో జరిగిన మ్యాచ్లో తిలక్ అద్భుతమైన ఫర్పామెన్స్ ఇచ్చాడు.  ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.  29 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్ తో 41 పరుగులు చేశాడు.

తిలక్ వర్మకు ముంబయి యాజమాన్యం ప్రశంసలు

ముఖ్యంగా ముఖేష్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు తిలక్‌. వరుసగా ఫోర్‌, రెండు సిక్స్‌లు బాది గెలుపును ముంబైకు మరింత చేరువ చేశాడు. అంతకు ముందు బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో తిలక్‌ ఆడిన ఇన్నింగ్స్‌ను అంత ఈజీగా మర్చిపోలేం. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతులు ఎదుర్కొన్న వర్మ 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తానికి ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ క్రికెటర్‌…147 పరుగులు చేశాడు. టోర్నీలో ముంబై తరపున టాప్‌స్కోరర్‌గా వర్మనే కొనసాగుతున్నాడు.

హర్షా బోగ్లే, తిలక్‌ వర్మ, రవిశాస్త్రి

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న తిలక్‌ వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు తిలక్‌ బ్యాటింగ్‌కు ముగ్ధులవుతున్నారు. ‘ఎలాంటి పిచ్‌పై నైనా చెలరేగే సత్తా తిలక్‌కు ఉంది. అతను ముంబైకి దొరికిన విలువైన ఆస్తి’ అని ప్రముఖ కామెంటేటర్‌ హర్షా బోగ్లే తిలక్‌ను అభినందించారు.

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ హైదారాబాదీని పొగడ్తలతో ముంచెత్తాడు. తిలక్ వర్మ అతి త్వరలోనే భారత జట్టు తరపున  అరంగేట్రం చేస్తాడని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు.

“తిలక్ వర్మ రూపంలో భారత జట్టుకు మరో యువ సంచలనం దొరికాడు. అతడు ఇప్పటికే టీమిండియా ఆటగాడిగా భావిస్తున్నాను. తిలక్ మరో ఐదు-ఆరు నెలలో టీమిండియా తరపున ఆడకపోతే.. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అని అన్నాడు.

తిలక్ వర్మ దగ్గర అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మిడిలార్డర్ బ్యాటింగ్ చేసే సత్తా వర్మకు ఉంది. ప్రస్తుతం అతడికి కేవలం 20 ఏళ్ల వయస్సు మాత్రమే. ఈ వయస్సులో అతడు ఆడుతున్న తీరు గురుంచి ఎంత చెప్పిన తక్కువే.  భారత జట్టుకు అతడు అద్భుతాలు సృష్టిస్తాడు” అని ‘స్టార్ స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

రోహిత్ శర్మ, తిలక్ వర్మ చిట్ చాట్

అసలు ఎవరీ తిలక్ వర్మ?

తిలక్ వర్మ (19) ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చాడు. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. దీంతో తిలక్ క్రికెట్ కోచింగ్‌కు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో కోచ్ సలాం బయాష్… తిలక్ క్రికెట్ కోచింగ్‌కు అవసరమైనవన్నీ సమకూర్చారు. హైదరాబాద్ తరఫున మూడు ఫార్మాట్లలో తిలక్ దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 381 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉండగా… స్ట్రైక్ రేట్ 140కి పైగా ఉండటం విశేషం.

ఐపీఎల్‌లో తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.1.7 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌తో పోటీ పడి ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను దక్కించుకోవడం విశేషం. తిలక్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా… దానికి 8.5 రెట్లు అధిక మొత్తం తనకు లభించింది.

పేరెంట్స్‌కు ఇల్లు కొనిస్తా..

Source: Instagram

ఈ సందర్భంగా తిలక్‌ వర్మ.. క్రిక్‌బజ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన కుటుంబ నేపథ్యం, ఆర్థిక కష్టాలు, ఐపీఎల్‌ వేలంలో తనకు భారీ ధర దక్కడంపై తన కోచ్‌, తల్లిదండ్రులు ఎలా రియాక్టయ్యారన్న విషయాల గురించి ఈ ఇంటర్వ్యూలో తిలక్‌ చెప్పుకొచ్చాడు. “ఐపీఎల్‌ వేలం జరిగే సమయంలో నేను నా కోచ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాను. నా కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడుతూ ధర ఎగబాకుతుండటం చూసి కోచ్‌ ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు. ముంబై నన్ను కొనుగోలు చేసిన తర్వాత నా పేరెంట్స్‌తో మాట్లాడాను. వాళ్లు కూడా ఫోన్‌లోనే దుఃఖం ఆపుకోలేకపోయారు. మా అమ్మ నోట మాట రాలేదు.

ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కే ముందు వరకూ నా కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండేది. చాలా ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాం. నా తండ్రికి వచ్చే కాస్త జీతంతోనే నా క్రికెట్‌ కోచింగ్‌, నా అన్న చదువులకు ఖర్చు పెట్టేవాడు. గత కొన్నేళ్లుగా కొంత స్పాన్సర్‌షిప్‌, మ్యాచ్‌ ఫీజులతో నా ఖర్చులు నేను భరించడం మొదలుపెట్టాను. ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. ఐపీఎల్‌లో వచ్చిన డబ్బుతో మా తల్లిదండ్రులకు ఇల్లు కొనివ్వాలనుకుంటున్నాను. ఈ డబ్బు ఇక నా కెరీర్‌ను స్వేచ్ఛగా కొనసాగించే వీలు కల్పించింది” అని తిలక్‌ వర్మ చెప్పాడు.

తిలక్‌ వర్మ  కోచ్ సలామ్ బయాష్

Source: Instagram

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడినప్పటికీ.. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (46 బంతుల్లో 84) బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. పేద కుటుంబంలో జన్మించిన తిలక్ వర్మ ఈ స్థాయికి చేరడానికి అతడి చిన్న నాటి కోచ్ సలామ్ బయాష్ ప్రధాన కారణం కావడం విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles